సర్వవైదిక సంస్థానం
Sarvavaidika Samsthanam
యజ్ఞవరాహక్షేత్రం, కరీణ్ణగరమ్
Yagnavaraha Kshetram
Sribhashyam Vijayasarathi
పద్మశ్రీ, మహామహోపాధ్యాయ, వాచస్పతి
శ్రీభాష్యం విజయసారథి
1936 – 2022
క్షేత్ర నిర్మాత · Founder
యుగకర్తా యుగోద్ధర్తా చక్రవర్తీ యుగస్యచ!
సరస్వతీ సుతోత్తంసః జీయాద్విజయసారథిః

శ్రీభాష్యం విజయసారథి గారు ఆధునిక భారతీయ సంస్కృత కవి, పండితులు, విమర్శకులు. న్యాయ వైశేషిక, ఆగమ, జ్యోతిశాస్త్ర పారంగతులు. శతాధిక గ్రంథకర్త. మూర్తీభవించిన సంస్కృత భాష. సంస్కృతం కేవలం దైవభాషగా కాకుండా ప్రజల భాషగా నిరూపించి అమరభాషలో ఆధునికులయ్యారు. గంగావతరణ ఘట్టాన్ని రేఖామాత్రంగా స్వీకరించి లోకకళ్యాణం అంతస్సూత్రంగా రచించిన మందాకిని కావ్యం జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిందుకొనడమేగాక విజయసారథి గారిని మహాకవిగా నిలబెట్టిన మహాకావ్యం. వీరి భారతభారతి జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలందుకున్న గొప్ప ఖండకావ్యం. సంస్కృత సాహిత్యంలో వీరు చేపట్టని ప్రక్రియ లేదు. సుప్రభాత, కావ్య, దేశభక్తి, లేఖా, సూక్త, మాలికా, ఉదాహరణ, సంగీత,నృత్య, సాంఘిక, చైతన్య, అనువాద, గద్య, విమర్శ, నవల, ప్రహసన, ఏకాంకిక వంటి ప్రక్రియలన్నింటినీ సుసంపన్నం చేసినారు.

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో శ్రీమాన్ శ్రీభాష్యం నరసింహాచార్య-గోపమాంబ పుణ్య దంపతులకు నాల్గవ సంతానంగా తేది 10-03-1936న జన్మించిన శ్రీభాష్యం విజయసారథి గారు వరంగల్లు లోని శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలలో 35 సంవత్సరాల పాటు అధ్యాపకులుగా పనిచేసారు.వారి ధర్మపత్ని శ్రీమతి శ్రీభాష్యం హేమలత. కుమారుడు: వరప్రసాదశర్మ కోడలు: కల్యాణి మనుమరాండ్లు: శ్రీవత్స, వాఙ్మయి.

కవిగా అనేక జాతీయ పురస్కారాలందుకున్న వీరిని భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. 2018లో తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మహామహోపాధ్యాయ బిరుదుతో గౌరవించింది. వీరి రచనలు అనేక విశ్వవిద్యాలయాల పాఠ్యపుస్తకాలలో చోటుచేసుకున్నాయి.

1980లో తమ ఆధ్యాత్మిక గురువుల దివ్యాశీస్సులతో సనాతన ధర్మ ప్రచారము లక్ష్యంగా కరీంనగర్‌లో సర్వవైదిక సంస్థానమును స్థాపించినారు. నాటి నుండి ఈ సంస్థానం యొక్క సర్వతోముఖ వికాసానికి తమ విలువైన జీవితాన్ని నిస్వార్థంగా ధారపోశారు. తేది 22-10-1986న యజ్ఞవరాహక్షేత్రమును స్థాపించినారు. ఈ క్షేత్రము విజయసారథి గారి తపోవనం. చతుర్వేద స్వాహాకార సహితముగా శ్రీమద్రామాయణ మహాక్రతువు, భాగవత సప్తాహము, శ్రీ మహావిష్ణు యాగము,అష్టోత్తర శతకుండాత్మక శ్రీమహాలక్ష్మీ మహాయాగం,కోటి కుంకుమార్చన వంటి విశేష కార్యక్రమాలను, పురాణేతిహాసాలపై సభలు, సంగీత నృత్య కార్యక్రమాలు, కవి,పండిత,కళాకారుల సన్మానాలు, కవి సమ్మేళనాలు, సంస్కృతభాష ప్రచార, ప్రసార కార్యక్రమాలు అనేక మార్లు నిర్వహించారు. నూతన ఆలయ ప్రతిష్టలతోపాటు వందలాది ఆలయాల జీర్ణోద్ధరణలు చేపట్టినారు. తమ ఉపాసనా బలము మరియు జ్యోతిర్విజ్ఞానముతో ఎంతో మంది భక్తుల కర్మజ వ్యాధులకు జప హోమములతోను పారాయణాదులనిచ్చి అద్భుతమైన పరిష్కారమార్గములను చూపి గురుదేవులయ్యారు. వారి సంకల్పబలముతో యజ్ఞవరాహక్షేత్రమ్ దివ్యదేశంగా విరాజిల్లుతోంది.

సర్వవైదిక సంస్థాన స్థాపనాచార్య మన్వహమ్
శ్రీభాష్య వంశతిలకమ్ వన్దే విజయసారథిమ్
డాక్యుమెంటరీ యూట్యూబ్‌లో చూడండి

https://www.youtube.com/watch?v=tLw4C5Un4Pg

📖Wikipedia లో చదవండి

https://en.wikipedia.org/wiki/Sribhashyam_Vijayasarathi